Sunday, November 30, 2008

chandragiri kota


1640లో కట్టబడిన కోట కలదు. మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం. అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచే వారు ఇలా నిర్మించుట వలన కోట రక్షణ కొండ ప్రాంతమువైపుగా తగ్గగలదనీ కొండపైనుండి శత్రువుల కదలికలను దూరంనుండి గమనించుట సులభం కనుక కొండ ప్రక్కగా నిర్మించారనీ మ్యూజియంలో సమాచారముద్వారా తెలుస్తున్నది . కోట చుట్టూ దాదాపు కిలో మీటరు దృడమైన గోడకలదు ఈ గోడ నిర్మించేందుకు వినియోగించిన రాళ్ళ పరిమాణం చాలా పెద్దది దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది. ఈ గోడ పొదల తుప్పల మద్య ఇప్పటికీ చెక్కు చెదరక ఉన్నది. ఈ గోడననుసరిస్తూ బయటి వైపుగా పెద్ద కందకము కలదు ప్రస్తుతము పూడిపోయిననూ అప్పటి కాలమందు ఇందులో మొసళ్ళను పెంచే వారట.

విజయ నగర రాజుల చరిత్రలో ఈ చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయలు తిరుమల దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు. అచ్యుతదేవరాయలను ఇక్కడే గృహనిర్బందములో ఉంచినారు. బ్రిటీష్ వారికి చిట్టచిరవి రాయల వంశస్తులు చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి అనుమతిచ్చింది ఈ కోట నుండే, ఇప్పటికీ ఆనాటి దస్తావేజులను మ్యూజియంలో చూడవచ్చు.

కొండ పై భాగమున ఒక సైనిక స్థావరము నిర్మించారు. వారి అవసరముల నిమిత్తము పై భాగమున రెండు చెరువులను నిర్మించి క్రింది నున్న పెద్ద చెరువు నుండి పైకి నీటిని పంపించేవారని కోటలో మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తున్నది (ఇప్పటికీ కొండపైకి నీటిని పంపించుట అనేది పెద్ద మిస్టరీ. అప్పుడు పైకి పంపించేందుకు ఉపయొగించిన సాధనాలు పాడయిపోయినవి అయితే పైన చెరువులు మరియు క్రింద చెరువు ఇప్పటికీ మంచి నీటితో కనిపిస్తాయి}.


రాణీ మహల్ రెండు అంతస్తులుగానూ రాజ మహల్ మూడు అంతస్తులుగానూ ఉంది. రాణీ మహల్ చాలా వరకు పాడయిపోయినది. రాణీ మహల్ పేరుకే రాణీమహల్ అని ఇప్పుడు పిలుస్తున్నారు కానీ దీని వాస్తునుబట్టి ఇది ఒక గుర్రపు శాల కావచ్చని అక్కడి బోర్డునందు వ్రాసి ఉంది. పురావస్తు శాఖ అధీనములోకొచ్చిన తరువాత కొంత వరకూ బాగు చేసారు. రాణీమహల్ వెనుక కొంచెం దూరంగా కోట నీటి అవసరాలకోసం ఒక దిగుడు బావికలదు దీనినుండే అంతప్పుర అవసరాలకు నీటిని సరపరా చేసే వారని తెలియ చేయబడినది. ఈ బావికి కొద్ది దూరములో మరణశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు ఆరు స్థంభాలు కలిగి ఉపరితలమునకు నాలుగు రింగులు ఉన్న చిన్న మండపము ఉన్నాయి. రాజమహలులో మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు. ముస్లింపాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు లాంటివి ఇందులో ఉన్నాయి. రెండవ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని చూడచ్చు{సింహాసనములు మొదలైనవి అప్పటివే ఉన్నాయి}.


మూడవ అంతస్తులో అప్పటి కోట నమూనా ప్రజలజీవన విధానం లాంటివి మరుగుజ్జు నమూనాలు ప్రదర్శన కొరకు ఉంచారు ఇదే అంతస్తులో రాజప్రముఖుల గదులు కలవు. చాలా వరకూ పాడైన దేవాలయాలు వదిలేసి కొంత బాగున్న రాణీమహల్ మరియు రాజమహలు,వీటివెనుక ఉన్న చెరువు మొదలయినవాటిని బాగుచేసి కొంత వరకూ గార్డెన్ వేసి అన్ని చోట్లా మొక్కలు పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా ఉండేలా మార్చారు. రాజమహలుకు వెనుక కాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్ దియేటర్ మాదిరిగా మార్చి దృశ్య కాంతి శబ్ధ (సౌండ్,లైటింగ్ షో) ప్రదర్శనం చేస్తారు. ఈ ప్రదర్శనకు ఇరవై ఐదు రూపాయలు సామాన్య రుసుము కలదు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఐదు కోట్ల రూపాయల మొత్తముతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసారు.ఈ ప్రదర్శన ద్వారా పెనుకొండ చంద్రగిరి సంస్థానాలు ఎలా నాశనమయిపోయాయో కళ్ళకు కట్టినట్లుగా లైటింగ్ ద్వారా శబ్ధాల ద్వారా వివరించబడుతుంది. ఈ ప్రదర్శన తెలుగు మరియు ఆంగ్ల బాషలందు కలదు ఆంగ్లబాషలో వాఖ్యానము అమితాబ్ బచ్చన్ స్వరంలో వినచ్చు.


No comments: